వైద్యం కోసం వచ్చిన వారికి భోజనం.. వృద్ధుల మనసు గెలిచిన సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్
పొనకల్లో సేవకు జనం జైకొట్టారు
జన్నారం లోని
ఆస్పత్రి ఖర్చులు భరించలేని పేదలకు వైద్యం అందితే.. అంతకంటే గొప్ప సేవ మరొకటి ఉండదు. జన్నారం మండలం పొనకల్లో నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరం ఇందుకు నిదర్శనంగా నిలిచింది. వైద్యం కోసం వచ్చిన రోగులకు పరీక్షలు, మందులతో పాటు భోజనం కూడా ఏర్పాటు చేయడంతో కార్యక్రమానికి హాజరైన ప్రజలు నిర్వాహకులను అభినందించారు.
పొనకల్ సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్, లయన్స్ క్లబ్ ఆఫ్ జన్నారం ఆధ్వర్యంలో చందా న్యూరో అండ్ ట్రామా కేర్ సెంటర్ సహకారంతో ఈ శిబిరం నిర్వహించారు. మండలంలోని 29 గ్రామపంచాయతీల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. వృద్ధులు, మహిళలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యుల వద్దకు చేరి పరీక్షలు చేయించుకున్నారు.
బీపీ, షుగర్, ఈసీజీ సహా అవసరమైన వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. నరాలు, వెన్ను, కీళ్ల సమస్యలు, పక్షవాతం వంటి సమస్యలతో వచ్చిన వారికి వైద్యులు పరీక్షలు చేసి తగిన సూచనలు ఇచ్చారు. అవసరమైన వారికి మందులను కూడా ఉచితంగా అందించారు.
రోగుల ఆకలి కూడా తీర్చారు
సుదూర గ్రామాల నుంచి వచ్చిన రోగులు, వారి వెంట వచ్చిన కుటుంబ సభ్యులకు నిర్వాహకులు ఉచిత భోజనం ఏర్పాటు చేశారు. వైద్యం కోసం వచ్చిన వారిని కేవలం పేషెంట్లుగా చూడకుండా.. వారి అవసరాలను గుర్తించి భోజనం అందించడం ప్రత్యేకంగా ఆకట్టుకుంది.
“మా పిల్లల మాదిరిగా చూసుకున్నారు”
శిబిరానికి వచ్చిన పలువురు వృద్ధులు సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. “మా పిల్లలు దగ్గరుండి చేయాల్సిన సేవను మీరు చేశారు. మా ఆరోగ్యం గురించి ఆలోచించి వైద్యం చేయించి, మందులు ఇప్పించి, భోజనం పెట్టించారు. మమ్మల్ని మా సొంతవాళ్లలా చూసుకున్నారు” అంటూ భావోద్వేగంతో పేర్కొన్నారు.
చందా న్యూరో కేర్ వైద్య బృందం అందించిన సేవలపై కూడా ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. శిబిరంలో వైద్యులు సూచించిన రోగులకు ఆస్పత్రిలో ఉచిత ఓపీ సదుపాయం కల్పిస్తామని నిర్వాహకులు తెలిపారు. పేదల ఆరోగ్యం కోసం పొనకల్లో చేపట్టిన ఈ కార్యక్రమం సేవా దృక్పథానికి మంచి ఉదాహరణగా నిలిచిందని గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.